తెలుగు సినీ పరిశ్రమకు నిన్న మొన్నటి వరకు డైరెక్టర్ దాసరి నారాయణ రావే పెద్ద దిక్కు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఆయన మాటకు ఎదురేలేదు. ఆయన చెప్పిందే వేదం. తాను అనుకున్నది.. తనకు న్యాయం, మంచి అనిపించినది చెప్పి మరీ ఎవరినైనా ఒప్పించగలరు. నువ్వు చేస్తోంది తప్పు.. నువ్వు చేస్తుంది కరెక్ట్.. అని నిక్కచ్చిగా చెప్పగలిగిన వ్యక్తి దాసరి. అందుకే ఆయన ఎంతో కాలం తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా ఉన్నారు. ఆ పెద్ద దిక్కు ఇటీవల దూరమైన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా సినీ పెద్దలకు కావాల్సింది సినిమా వారితో పరిచయాలు కాదు.. సాన్నిహిత్యం కాదు.. సినీ కార్మికులను అర్థం చేసుకొని వారి కష్టనష్టాలను తెలుసుకొని వాటికి సరైన మార్గం వేసే వారే సినీ పెద్ద దిక్కు అవుతారని కొందరు అంటారు. ఈ విషయంలో దాసరి తర్వాత చెప్పుకోవాల్సిన పేర్లు తమ్మారెడ్డి భరద్వాజ్, సి. కళ్యాణ్. ఇక ఈ రెండు పేర్లతో పాటు మోహన్‌బాబు పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. దాసరి ఉన్నంతవరకు దాసరి తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ వద్దకు ఎక్కువగా సినీ కార్మికులు తమ కష్టాలు చెప్పుకోవడానికి వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు తమ్మారెడ్డి, సి. కళ్యాణ్, మోహన్ బాబు వంటి విభిన్న పేర్లు ప్రచారంలోకి వస్తుండడంతో సినీ కార్మికులకు కూడా ఎవరు తమకు పెద్దదిక్కు.. తమ సమస్యలను ఎవరికి చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు.
వాస్తవానికి చిరంజీవిని మించిన సినీ పెద్ద దిక్కు తెలుగులో ఎవ్వరూ ఉండరు. ఆయనకు 150 చిత్రాలకు పని చేసిన అనుభవంతో పాటు సినీ కార్మికులు, సినీ నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు.. ఇలా లైట్ బాయ్ నుంచి అందరితోనూ ఆయనకంటూ ఒక సాన్నిహిత్యం ఉంది. అలాగే ఆర్థికంగా కూడా ఆయన పెద్ద దిక్కు. ఆయన అయితే ఆపదలో ఉన్న చాలామందికి సహాయం చేయగలుగుతారు. ఇటీవల కరోనా సమయంలో కూడా ఆయనంతట ఆయన ముందుకు వచ్చి చేసిన సేవలు, సినీ కార్మికులకు అందించిన సహాయం అంతా ఇంతా కాదు. సమాజానికి ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించిన ఆయన.. సినీ పరిశ్రమ కోసం, సినీ కార్మికుల కోసం మరెన్నో చేశారు. కానీ ఎందుకనో కానీ వివాదాలు చిరుకి పెద్దగా ఇష్టం లేదు. ఆయన వివాదరహితునిగా ఉండాలనుకుంటారు. అందుకే వివాదాలను దాటవేస్తుంటారు.
తాజాగా చిరంజీవి చెప్పిన మాటలు కొన్ని బాగా వైరల్ అవుతున్నాయి. సినీ పరిశ్రమలో తనకంటే సీనియర్లు, పెద్దవారు చాలామంది ఉన్నారని చిరు చెప్పడం విశేషం. కావాలంటే పరిశ్రమకు ఏదైనా చేయాలనుకునే వారికి, కార్మికులకు అందరికీ సహకారం అందిస్తానని.. కానీ మొత్తం బాధ్యతలు తన మీద వద్దు అని అంటున్నారు. తాను ఇండస్ట్రీ పెద్ద అనే పదాన్ని.. ఆ బాధ్యతను స్వీకరించడానికి కూడా సిద్ధంగా లేనని, తనకు కుర్చీల్లో కూర్చోవడం ఇష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు. సినీ పెద్దలుగా తమ్మారెడ్డి భరద్వాజ్, సి.కళ్యాణ్‌లలో ఒకరు ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు. తాను కొందరి వాడిగా మిగిలిపోవడం ఇష్టం లేదని, అందరివాడుగానే అందరికీ సాయం చేస్తానని మరోసారి నొక్కి చెప్పారు.
కానీ మరోవైపు సినీ పెద్దగా సినీ పరిశ్రమ మొత్తం ఆయన పేరే చెబుతుంది. ఆయన మాత్రం తనకు ఉన్నత ఆసనం వద్దు అంటున్నారు. చిరంజీవి సినీ పెద్ద దిక్కుగా ఉన్నా లేకపోయినా.. ఎవరు ఆ స్థానాన్ని అధిరోహించినా సరే చిరంజీవి సూచనలు, సలహాలు మాత్రం సినీ పరిశ్రమకు ఉపయోగపడతాయి. ఇక్కడ చిరు మరో మంచి మాట కూడా చెప్పారు. సినీ పరిశ్రమ తాను కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చింది. అందువల్ల ఇకమీదట తన శక్తివంచన లేకుండా అందరికీ మేలు చేస్తాను అంటున్నారు.
కాగా దాసరికి, చిరంజీవికి మధ్య ఉన్న ఒక వ్యత్యాసాన్ని పలువురు లేవనెత్తుతున్నారు. దాసరి దగ్గరకు వెళ్లడానికి ఎవరికైనా ఈజీగా యాక్సెస్ ఉండేది. ఆయన ఇంటికి వెళ్లి కష్టసుఖాలు చెప్పుకొనే సౌలభ్యం ఎవరికైనా ఉండేది. చిరంజీవి దగ్గరకు వెళ్లడానికి అలాంటి సౌలభ్యం సాధారణ సినీ జీవులకు లేదనే విషయం జగమెరిగిన సత్యం. ఈ విషయం తెలుసు కాబట్టే.. సినీ పెద్దగా ఉండటానికి తను కరెక్ట్ కాదని చిరు అంటున్నారు. మొత్తానికి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తిగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.